హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అమలవుతున్న నాన్ కమ్యూనకేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) నియంత్రణ విధానాలు, డిజిటల్ వైద్య సేవలపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం సౌత్ ఈస్ట్ ఏషియా వర్క్‌షాప్ నడుస్తుండటంతో ఈ నెల 16 నుంచి 20 వరకు రాష్ట్రంలో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధుల టీమ్స్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించాయి. పది మంది సభ్యులతో కూడిన బృందాలుగా వెళ్లిన వీరు సిద్ధిపేట జిల్లాలోని కుక్నూర్ పల్లి, ములుగు, మార్పడగ, రాయవరం గ్రామాల్లోని పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లతో పాటు హైదరాబాద్ లోని అల్వాల్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు.
ఆయా ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, రోగులకు అందిస్తున్న సేవలు, హైపర్‌టెన్షన్‌తో పాటు ఇతర అసంక్రమిత వ్యాధుల నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ బీపీ మానిటర్లు, తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ ద్వారా అందిస్తున్న పరీక్షల సేవలు, వాటి పనితీరును పరిశీలించారు. తెలంగాణ ఎన్సీడీ పోర్టల్ పనితీరు, దాని వినియోగ విధానం గురించి కూడా వివరాలు తెలుసుకున్నారు.
ఎన్సీడీల నియంత్రణలో, వైద్య సేవల్లో డిజిటల్ టెక్నాలజీని వినియోగిస్తున్న విధానం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ప్రజలకు అందిస్తున్న సేవలు సమర్థవంతంగా ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధులు ప్రశంసించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఈ విధానాలు ఇతర దేశాల్లోనూ అనుసరించేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యటనలో రాష్ట్ర ఎన్సీడీ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కరుణ శ్రీ, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్, డాక్టర్ అబ్దుల్ వస్సే, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కార్తీక్, డాక్టర్ తేజశ్విని తదితర ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
